*కాఫీవిత్…ఆర్ రమాదేవి పొయెట్రీ…730
రమాదేవి..ఓ మధుర భావనను కవిత్వం చేయడంలో దిట్ట.ఈ కవిత కూడా అలాంటిదే..ప్రియసఖుడి
ఆనవాలును ఆరా తీసే సందర్భం. అతగాడి ఆనుపానులు తెలుసుకుంటూ,తన్నుతాను అతగాడి
జ్ఞాపకాల తీగకు పెనవేసుకునే ప్రేమ ఘట్టం ఇది…మీరు కూడా ఓ సారి ఈ కవిత చదవండి..
“నువ్వు
ప్రేమలోని అపురూపాన్ని
చెరగనివ్వకుండా
నిలిపివుంచిన
ఓ సొగసైన అద్భుతం....
అందుకేనేమో
నీకోసం చెప్పే ప్రతిమాట
తనను తాను
అందంగా మలచుకుంటుంది..
అందుకేనేమో...ఎక్కడో
చినుకు చినుకుగా రాలినా
నాకు నేనుగా పెనవేసుకుని
నదినై నీకై వెతుకుతా....
అందుకేనేమో... మరి
నేను కాస్తంత మృదువైన
నెమలీకనే కదా అని అనుకున్నా
నీ అడుగుజాడల వెంబడే
పరుగులు తీస్తాను...
ఇంతకూ
ఎవరు నువ్వు ..
ఏ ఆకాశపు
తారాతోరణం నుండి
జాలువారావోయ్ ....”!!
*ఆర్..రమాదేవి…!!
అతడు ఆషామాషీ చెలికాడేం కాదు.ప్రేమలోని అపురూపాన్ని ఏమాత్రం చెరగనివ్వకుండా,అలాగే
నిలిపివుంచిన ఓ సొగసైన అద్భుతం కూడా,అందుకే అతగాడంటే ఆమెకు అంతిష్టం.అతగాడి కోసం
చెప్పే ప్రతిమాటను ఆమె అందంగా మలచుకుంటుంది..అద్దంలో చూసుకున్నట్టు ఆ మాటలో…
తానూ వుంటుంది.అంతగా పెనవేసుకున్న ప్రేమ బంధం ఆ జంటది..
అందుకే…ఎక్కడో చినుకు చినుకుగా రాలినా,
బిందువు,బింధహదువు సింధువైనట్టు..తనకు తానుగా నదిగా మారి, అతగాడికోసం వెదుకుతుంది..నది సముద్రంలో కలవడానికి పరిగెత్తినట్టు,..సముద్రమంత ప్రేమను తనలో దాచుకున్న అతగాడిలో లీనమయ్యే తాపత్రయం ఆమెది..
అంతేకాదు.ఆమె కాస్తంత మృదువైన నెమలీకలా,అతగాడి అడుగుజాడల వెంబడి పరుగులు తీస్తుంది…దొరకతకపోతాడా! అని..
ఇప్పుడు ఆమెకో సంశయం పట్టుకుంది…
ఇంతకూ అతగాడెవరు.ఏ ఆకాశపు తారాతోరణం నుండి జాలువారాడు..ఏమిటీవిడదీయలేనిబంధం.
ఏనాటిదీ స్నేహం? ఏపాటిదీ ప్రేమ? ప్రేమలో ఇంత చిక్కదనం, నిరీక్షణలో ఇంతచక్కదనం వుంటుందని ఆమెకు ఇప్పుడే తెలిసింది.తన మానస చోరుడి ఆనవాళ్ళకోసం అన్వేషిస్తోంది.
ప్రేమ ఎంత మధురం అన్న కవికి, ‘ నిరీక్షణ’
అంతకన్నా మధురమని తెలియదు కాబోలు..!!
*ఎ.రజాహుస్సేన్…!!